నాచురల్ స్టార్ నాని పూర్తిపేరు గంటా నవీన్‌బాబు. గంటా రాంబాబు, విజయలక్ష్మీ దంపతులకు 1984 ఫిబ్రవరి 24న జన్మించిన నానికి.. చిన్నప్పటినుంచే సినిమాలపై ఆసక్తి ఉండటంతో డిగ్రీ సెకండ్ ఇయర్‌లో ఉండగానే చదువు మధ్యలో వదిలేసి అవకాశాల కోసం డైరెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగేవాడు. అలా బాపు దర్శకత్వంలో తెరకెక్కిన రాధాగోపాలం సినిమాకు క్లాప్ అసిస్టెంట్‌గా అవకాశం వచ్చింది. తర్వాత రాఘవేంద్రరావు, శ్రీనువైట్ల దగ్గర పనిచేశాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లో రేడియోజాకీలో పనిచేస్తున్న సమయంలో ఓ వాణిజ్యప్రకటనలో నాని నటనను చూసి దర్శకుడు ఇంద్రగంటి మోమన్‌కృష్ణ అష్టాచమ్మా సినిమాలో అవకాశం ఇచ్చాడు. మొదట ఈ సినిమాలో నానిని సెకండ్ లీడ్‌గా అనుకున్నా..నాని నటనకు ఇంప్రెస్ అయ్యి మెయిన్‌లీడ్‌లో నటించే అవకాశం ఇచ్చాడు దర్శకుడు. అలా అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి సినీ హీరోగా ఎదిగాడు.
తర్వాత రైడ్, స్నేహితుడా, భీమిలి కబడ్డీ జట్టు సినిమాల్లో నటించినా అవి పెద్దగా సక్సెస్ కాలేవు. 2011 లో నందినీరెడ్డి దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన అలా మొదలైంది సినిమా..నాని కెరియర్‌కు బాగా ప్లస్ అయ్యింది. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా.. 23 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఈ సమయంలోనే తమిళంలో వెప్పం అనే సినిమాలోనూ నటించాడు. ఇది తెలుగులో సెగ పేరుతో అనవదించబడింది. 2012లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాలో నానిది తక్కవ నిడివే అయినా తన నటనతో అందర్నీ ఆకట్టుకున్నాడు. అదే సంవత్సరం గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నాని, సమంత నటించిన ఎటో వెళ్లిపోయింది సినిమాతో మరోసారి ఆకట్టుకొని నంది అవార్డును అందుకున్నాడు నాని. నిర్మాతగా నాని తీసిన మొదటి సినిమా ఢీ ఫర్ దోపిడి. ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చింది.